కైకలూరులో అభివృద్ధి ఆశల జాతర!
- ఆగస్టు 10న కలిదిండి వేదికగా ముఖ్యమంత్రి పర్యటన
- 22ఏ పట్టాలు, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీతో పాటు కీలక ప్రకటనలపై ఉత్కంఠ
- ఏలూరు జిల్లా దృష్టి అంతా కలిదిండి సభపైనే
- అధికార యంత్రాంగం అప్రమత్తం, రాజకీయంగా పెరిగిన సందడి
కలిదిండి, ఆంధ్రప్రభ: ఆగస్టు 10న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గంలో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటనతో కలిదిండి ప్రాంతం సందడిగా మారగా, ప్రజల్లోనూ భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 22ఏ పట్టాలు, కొత్త పాస్‌పుస్తకాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భూ హక్కుల సమస్యలకు పరిష్కారం దొరకనున్న నేపథ్యంలో వేలాది కుటుంబాలు ఈ సభపై ఆశలు పెట్టుకున్నాయి.
అంతేకాకుండా, కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తాగునీరు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొత్త హామీలు వెలువడతాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఇక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో ప్రజలను సభకు తరలించే ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటనతో కైకలూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సభ ద్వారా ఏలూరు జిల్లా అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం లభిస్తుందా, కైకలూరుకు మరిన్ని అభివృద్ధి వరాలు ప్రకటిస్తారా అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆగస్టు 10న జరిగే ఈ సభ జిల్లా రాజకీయ, అభివృద్ధి పరంగా కీలక మలుపుగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
