వైరల్ వీడియో.. ఏడు సింహాలకు ఎదురు నిలిచిన ఆవు

ఆంధ్రప్రభ : గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం గ్రామంలోకి వచ్చిన ఏడు ఆసియాటిక్ సింహాలను ఓ ఆవు ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రాజులా తాలూకాలోని ఖారీ గ్రామంలో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన ఏడు సింహాలు ఓ ఆవును చుట్టుముట్టాయి. అయితే ఆవు ఏమాత్రం భయపడకుండా కొమ్ములతో ఎదురుదాడి చేస్తూ గట్టిగా ప్రతిఘటించింది. కొంతసేపు ప్రయత్నించిన సింహాలు చివరకు వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు ఆవు ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. గిర్ అడవులకు ఆనుకుని ఉన్న అమ్రేలి ప్రాంతంలో సింహాలు తరచూ గ్రామాల్లోకి రావడం సాధారణమే అయినప్పటికీ, ఒకే ఆవు ఏకంగా ఏడు సింహాలను ఎదుర్కొని తప్పించుకోవడం అత్యంత అరుదైన ఘటనగా స్థానికులు చెబుతున్నారు.