టైగర్ జోన్ ఆంక్షలు సడలించాలని ఎమ్మెల్యే వెడ్మ డిమాండ్
జన్నారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల టైగర్ జోన్‌లో అమలవుతున్న ఆంక్షలను సడలించాలని, లేకుంటే అటవీ శాఖ అధికారులకు ఆదివాసీలు సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు.
సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కొందరు అటవీ శాఖ అధికారులు అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల సీఎఫ్, ఎఫ్‌డీపీటీ శాంతారాం సహా కొందరు అధికారులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఇందనపల్లి ప్రాంతంలో ఆరుగురు ఆదివాసీ యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను 24 గంటల్లో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అటవీ శాఖలోని కొందరు అధికారుల తీరుకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రజల పక్షాన నిలుస్తానని, 24 గంటల తర్వాత ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, జిల్లా కార్యదర్శి ముజాఫర్, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు బొంతల లక్ష్మణ్, పార్టీ నాయకులు శంకరయ్య, భూమేష్, లక్ష్మణ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
