అద్దంకిలో రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

  • కొత్త బీటీ రోడ్డు, కాజ్‌వేను ప్రారంభించిన గొట్టిపాటి రవికుమార్
  • జార్లపాలెం–చెరువుకొమ్ముపాలెం మధ్య నూతన రహదారి ప్రజలకు అంకితం..
  • గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడి

అద్దంకి, ఆంధ్రప్రభ: అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం జార్లపాలెం నుంచి చెరువుకొమ్ముపాలెం వరకు సుమారు రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రహదారిని, అలాగే చెరువుకొమ్ముపాలెం వద్ద రూ.30 లక్షలతో నిర్మించిన కాజ్‌వేను ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా మాత్రమే అభివృద్ధి ప్రతి ఇంటికీ చేరుతుందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పల్లెపల్లెల్లో నాణ్యమైన బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కొత్తగా ప్రారంభించిన బీటీ రహదారి, కాజ్‌వే వల్ల స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.