తక్కువ ధరకే సన్న బియ్యం విక్రయాలు..

కిలోకు రూ.10 వరకు తక్కువ ధర..
పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్


చిత్తూరు, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ బ్యూరో): పేద ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సన్న బియ్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రైతు బజార్‌లో తక్కువ ధరకే సన్న బియ్యం విక్రయాలను ఆయన సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రజలకు మార్కెట్ ధరల కంటే కిలోకు రూ.10 వరకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించే నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుందని, రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలు రైతు బజార్‌లను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రైతులు పండించిన తాజా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించే రైతు బజార్‌లను మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతు బజార్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వ్యాపార అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రైతు బజార్‌ల అభివృద్ధికి భాగస్వాములు కావాలని సూచించారు.

అనంతరం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అరకు కాఫీతో పాటు గిరిజన సహకార సంఘాలు తయారు చేస్తున్న తేనె, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, హ్యాండ్‌వాష్, ఫ్లోర్ క్లీనర్లు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందిందని, ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గిరిజనుల జీవనోపాధికి తోడ్పాటు అందించవచ్చని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా చూడా (CHUDA) చైర్‌పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, ఇతర ఎంపిక చేసిన రకాల బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ ధరలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం విక్రయిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చూడా చైర్‌పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజా నరసింహులు, జిల్లా పౌర సరఫరాల అధికారి లక్ష్మి, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వరన్, టీడీపీ పరిశీలకులు కుమారి, రాష్ట్ర కార్యదర్శి కార్జాల అరుణ, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు సురేంద్ర కుమార్, సీకే లావణ్య, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, అనురాధ గిరి, నరేష్, ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.