అవినీతి, అక్రమాలను అడ్డుకోండి…

ఇసుక, బియ్యం, మద్యం మాఫియాను అరికట్టాలి.
చెలరేగుతున్న నాయకులపై ఉక్కు పాదం మోపాలి..
టీడీపీ నేతల అండతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు..
వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..
మాఫియాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ వినతిపత్రం
అసలు సూత్రధారులను వదిలేసి వాహన డ్రైవర్లపైనే కేసులు పెడుతున్నారు
15 రోజుల్లో కఠిన చర్యలు లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, ప్రభుత్వ స్థలాల విక్రయాలపై విచారణ జరపాలని డిమాండ్


(విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో ఇసుక, మద్యం, బియ్యం మాఫియాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటికి అండగా నిలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ విక్రయాలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

విజయవాడలో సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం దేవినేని అవినాష్ విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూములు, కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించి విక్రయిస్తున్నారనే ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇసుక, మద్యం, బియ్యం మాఫియాలు జిల్లాలో నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, అధికారులు అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోకుండా వాహనాల డ్రైవర్లకే పరిమితమవుతున్నారని విమర్శించారు. మాఫియాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆయన, అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ… విజయవాడ నుంచి ఇతర జిల్లాలకు పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా నియంత్రణ చర్యలు కనిపించడం లేదన్నారు. బియ్యం మాఫియా, ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లను అక్రమంగా కేటాయించి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల్లో ఎవరి ప్రమేయం ఉందో వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు 15 రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోపు చర్యలు లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.