తప్పులు సరిదిద్దుకుంటాం : కేటీఆర్‌

“2028లో యూపీఎస్సీ తరహా ఉద్యోగాలు”
“బలవన్మరణాలకు పాల్పడొద్దు”
రాహుల్ హామీలు ఏమయ్యాయి?”
“2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?”
“రేవంత్‌కు కేటీఆర్ సవాల్”
“నీ అఫిడవిట్ నువ్వే నింపగలవా?”
“ఒక్క పోటీ పరీక్షైనా రాశావా?”
“నిరుద్యోగులను మోసం చేశారు”
“వేణుకుమార్ లేఖే సాక్ష్యం”
“రైతులను ఎండబెట్టారు”

హైదరాబాద్, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతాంగం, ప్రభుత్వ హామీలు, విద్యార్థుల అంశాలపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని తప్పులను తాము గుర్తించామని, తిరిగి అధికారంలోకి వస్తే వాటిని సరిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు. 2014 నుంచి 2023 వరకు 2.32 లక్షలకుపైగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలకు నియామకాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన నియామకాలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయాయని చెప్పారు. అలాగే ప్రైవేట్ రంగంలో 24 లక్షలకుపైగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు.

2028లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో పారదర్శక ఉద్యోగ నియామక వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఎవరూ బలవన్మరణాలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించిన కేటీఆర్, నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ ఆత్మహత్యాయత్నాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి, ఎల్లంపల్లి–మిడ్‌మానేరు నీటి తరలింపు అంశాలపై కూడా ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇంజినీరింగ్ విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ముందు తన ఎన్నికల అఫిడవిట్‌ను స్వయంగా నింపగలరా అని సవాల్ విసిరారు. పోటీ పరీక్షలు, విద్యార్హతల అంశాలపై కూడా సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు.

అదేవిధంగా ప్రభుత్వ వ్యయ విధానాలపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో అధికారిక నివాస నిర్మాణం, వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం, ఆయన వెలుగులోకి తెచ్చిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.