‘రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్’

‘వేణుకుమార్ లేఖే ప్రభుత్వానికి ఛార్జ్‌షీట్’
‘కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?’
‘రాహుల్ గాంధీ ఎక్కడ ప్రభుత్వం లేదో అక్కడే మాట్లాడతారు’
‘విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం దారుణం’
‘గ్యారంటీ కార్డులే క్రిమినల్ వేస్ట్’
‘ప్రజాధనం వృథా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం’
‘నిరుద్యోగుల కన్నీళ్లకు కాంగ్రెస్‌దే బాధ్యత’

హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం ఘటనను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. వేణుకుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఛార్జ్‌షీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు నిరుద్యోగ యువత ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, అలాంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ మౌనం పాటించడం ఎందుకని నిలదీశారు. “ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో అక్కడ రాహుల్ గాంధీ కనిపించరు.. ఎక్కడ ప్రభుత్వం ఉండదో అక్కడ మాత్రం విమర్శలు చేస్తారు” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని పేర్కొనడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేయడమే అసలు ‘క్రిమినల్ వేస్ట్’ అని విమర్శించారు.

అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీలు, గ్యారంటీ కార్డులు, ప్రభుత్వ వ్యయ విధానాలపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ ఉండగా రూ.200 కోట్లతో జూబ్లీహిల్స్‌లో కొత్త అధికారిక నివాసం నిర్మించడం, అందాల పోటీల నిర్వహణ, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడితో కార్యక్రమాల కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం, కేసీఆర్‌ను విమర్శించడానికే ప్రజల సొమ్ముతో బహిరంగ సభలు నిర్వహించడం ప్రజాధన వృథా అని ఆరోపించారు.