ఈ ఏడాది కుంభవృష్టి
అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది..
నేను సంతోషంగా రాలేదు. క్రోధంతో వచ్చాను
నేను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు
ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలి..
లేదంటే ప్రాణనష్టం జరుగుతుంది
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో అత్యంత విశిష్టంగా భావించే ‘రంగం’ కార్యక్రమం భక్తుల నడుమ వైభవంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు అంశాలను వెల్లడించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి తరహాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భవిష్యవాణి సందర్భంగా “నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చాను” అంటూ మాతంగి స్వర్ణలత వ్యాఖ్యానించారు. గతంలో తాను సూచించిన విగ్రహ ప్రతిష్ఠను ఇంకా పూర్తి చేయలేదని, అందువల్ల ఆరు నెలల్లోగా ఆ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే అనర్థాలు, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
సోమవారం జరిగిన బోనాల ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరై ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రంగం కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
