వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం..

  • నదీతీర ప్రజలకు ఊరట

భద్రాచలం/ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రతో పాటు తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రం 42.9 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం వరద తగ్గడంతో ములుగు జిల్లా మంగపేట మండలం పద్మూరు గ్రామానికి చెందిన 28 కుటుంబాలను పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వారి స్వగ్రామాలకు పంపించారు.

మేడిగడ్డ, తుపాకులగూడెంలో తగ్గిన ప్రవాహం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద గతంలో నమోదైన 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద 5.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే దేవాదుల పంప్‌హౌస్ ద్వారా 2,196 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

త్వరలో ఇసుకవాగు డైవర్షన్ రోడ్డు పనులు

గోదావరి వరదల కారణంగా వాజేడు మండలం చీకుపల్లి–పెద్దగొల్లగూడెం వద్ద ఇసుకవాగు డైవర్షన్ రోడ్డు దెబ్బతినడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద పూర్తిగా తగ్గిన వెంటనే మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పనులు పూర్తయ్యాక ఛత్తీస్‌గఢ్‌తో పాటు వాజేడు మండలంలోని 26 గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించబడనున్నాయి.

వరద తగ్గడంతో రైతులు తమ పొలాలకు వెళ్లి పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.