తెల్లవారక ముందే మద్యం అమ్మకాలు..!
- బాపట్ల జిల్లాలలోఊరూరా ‘బెల్టు’ సామ్రాజ్యం..
- బ్రాండ్ ఏదైనా ‘ఎక్స్ట్రా’ బాదుడే..
- జేబులు గుల్లవుతున్నా పట్టించుకోని వైనం
- పల్లెల్లో నాటుసారా గుప్పు..
- హైవేలపై విచ్చలవిడి అమ్మకాలు
- పెచ్చరిల్లుతున్న ప్రమాదాలు
- చీరాలలో జోరుగా గోవా మద్యం దందా..
- కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు
ఆంధ్రప్రభ బ్యూరో, బాపట్ల: ఒకప్పుడు పల్లెటూళ్లలో తెల్లవారుజామున పాలవాడి సైకిల్ బెల్ శబ్దం, పక్షుల కిలకిలరావాలు వినిపించేవి. పల్లె జనం ఉదయాన్నే లేచి పనుల్లోకి వెళ్లేవారు. కానీ, నేడు బాపట్ల జిల్లాలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు తెల్లవారక ముందే.. పాలు దొరుకుతాయో లేదో తెలీదు కానీ, కోరుకున్న బ్రాండ్ మద్యం సీసా మాత్రం ఇట్టే దొరికేస్తోంది.
ప్రభుత్వ మద్యం దుకాణాలు తలుపులు తెరిచే లోపే.. అనధికారిక ‘బెల్టు సామ్రాజ్యం’ తన విక్రయాలను ముగించేస్తోంది. ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్వర్క్, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో లోపాల వల్లే ఈ అక్రమ వ్యాపారం విస్తరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హైవేలపై ‘మృత్యు’ విక్రయాలు..
జిల్లా గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు (హైవేలు) ఇప్పుడు అక్రమ మద్యానికి ప్రధాన వేదికలుగా మారాయి. నిబంధనల ప్రకారం.. హైవేలకు దూరంగా మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా, బాపట్ల జిల్లాలో మాత్రం రహదారుల పక్కనే, రోడ్లపైనే యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. హైవేల వెంబడి ఉన్న ధాబాలు, కిరాణా కొట్లు, హోటళ్ల మాటున రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఈ దందా సాగుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండటంతో నిత్యం ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎంతో మంది పాదచారులు, ప్రయాణికులు ఈ అక్రమ మద్యం దందాకు బలవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా, విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా హైవేలపై సాగుతున్న ఈ విక్రయాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
చీరాలలో ‘గోవా’ గమ్మత్తు..
మరోవైపు చీరాల నియోజకవర్గ పరిధిలో అంతర్రాష్ట్ర మద్యం మాఫియా చెలరేగిపోతోంది. చీరాల సమీపంలో అధిక రిసర్ట్స్ ఉండటంతో ఇక్కడికి గోవా నుంచి అక్రమ మార్గాల్లో తరలిస్తున్న ‘గోవా మద్యం’ జోరుగా సరఫరా అవుతోంది. స్థానిక మద్యం ధరలతో పోలిస్తే ఈ గోవా మద్యం చాలా తక్కువ రేటుకే లభిస్తుండటంతో మందుబాబులు దీనిపై తెగ మక్కువ చూపిస్తున్నారు. చీరాల, దాని చుట్టుపక్కల తీరప్రాంతాలను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గోవా మద్యం నిల్వలు ఉంచి, గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నారు. ఈ భారీ అక్రమ దందాపై స్థానిక ఎక్సైజ్ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సందు సందునా.. బెల్టు షాపులు..
జిల్లాలోని పలు తీరప్రాంత, గ్రామీణ మండలాల్లో బెల్టు షాపుల నెట్వర్క్ గ్రామాల్లోని సందు సందుకూ విస్తరించింది. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, తెల్లవారకముందే సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు, రోజువారీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతోంది. ప్రధాన రహదారులు, గ్రామ కూడళ్లు, నివాస ప్రాంతాల మధ్య ఉండే కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలు, చివరకు చికెన్ సెంటర్ల మాటున కూడా యథేచ్ఛగా మద్యం సీసాలు చేతులు మారుతున్నాయి. కారంచేడు, కర్లపాలెం, ఎం.వి.రాజుపాలెం, కొల్లూరు, భట్టిప్రోలు, పిట్టలవానిపాలెం, పర్చూరు మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పుడు బెల్టు షాపులకు ప్రధాన కేంద్రాలుగా మారాయన్నది బహిరంగ రహస్యంగా మారింది.
గుప్పుమంటున్న ‘నాటుసారా’..
ఒకవైపు బెల్టు షాపుల జోరు సాగుతుంటే.. మరోవైపు ప్రాణాంతకమైన నాటుసారా దందా జిల్లాను కమ్మేస్తోంది. చీరాల పరిధిలోని ఓడరేవు, రామాపురం బీచ్ ప్రాంతాలతో పాటు, బాపట్ల మండలంలోని స్టువార్టుపురం పరిసర ప్రాంతాలు నాటుసారా తయారీకి, అక్రమ రవాణాకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల సరిహద్దు తగాదాలు, చూసీచూడనట్లు వ్యవహరించే ధోరణి సారా తయారీదారులకు వరంగా మారింది.
సారా బట్టీలపై దాడులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నిరుపేద కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా, గ్రామాల్లో తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నాటుసారా తాగి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
దోపిడీ పరాకాష్ట.. సీసాపై రూ.10 నుండి రూ.30 ఎక్స్ట్రా
ఇక మద్యం ధరల విషయానికి వస్తే దోపిడీ పరాకాష్టకు చేరింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ప్రతి సీసాపై అదనంగా రూ. 10 నుంచి రూ. 30 వరకు వసూలు చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి రూ. 50 వరకు కూడా అదనంగా గుంజుతున్నారు. నిబంధనల ప్రకారం బార్లలో కనీస ధరల పట్టికలు (రేట్ చార్టులు) స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉన్నా, ఎక్కడా వాటిని పెట్టకుండా కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు. ఎందుకు ఎక్కువ రేటు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ అదనపు వసూళ్ల వెనుక ఎక్సైజ్ అధికారుల ‘నెలవారీ మామూళ్ల’ హస్తం ఉందనే బలమైన విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రోడ్డున పడుతున్న కుటుంబాలు.. భయాందోళనల్లో మహిళలు
నివాస ప్రాంతాలు, పాఠశాలలకు కూతవేటు దూరంలోనే ఈ అక్రమ విక్రయాలు సాగుతుండటంతో మహిళలు, విద్యార్థినులు రోడ్లపై నడవాలంతే భయపడిపోతున్నారు. సాయంత్రం కాకముందే మద్యం మత్తులో కొందరు ఆకతాయిలు రోడ్లపైకి చేరి అసభ్య పదజాలంతో గొడవలకు దిగుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు తీసేయాలని ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మగవాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కాస్తో కూస్తో సంపాదనంతా తాగడానికే తగలేస్తూ ఉంటే, తమ కుటుంబాలు ఎలా గడవాలని, పిల్లల చదువులు ఎలా సాగాలని మహిళా సంఘాల ప్రతినిధులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అక్రమ దుకాణాలను శాశ్వతంగా మూసివేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించాల్సిన బాధ్యత అధికారులదే..
రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాప్స్ ఉక్కుపాదం మోపాలని అధికారులుకు ఆదేశాలు ఇస్తుంటే జిల్లాలో ఆ ఊసే కనపడటం లేదు. జిల్లాలో సాగుతున్న అక్రమ మద్యం నెట్‌వర్క్‌పై, హైవేలపై విచ్చలవిడి అమ్మకాలపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్సైజ్ శాఖ తన నిద్రమత్తు వదిలి తక్షణమే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ రంగానికి దించాలి. చీరాలలో సాగుతున్న గోవా మద్యం సరఫరాపై నిఘా పెంచాలి. కేవలం నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా, హైవేలపై మద్యం అమ్మే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే బార్లపై, బెల్టు షాపు నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసి, జిల్లాను మద్యం రహిత ప్రశాంత ప్రాంతంగా మార్చాలని బాపట్ల జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.
