అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలపై యువత అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ సూచన

కోరుట్ల, ఆంధ్రప్రభ: యువత అసాంఘిక శక్తులకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ సూచించారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ యువకులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాలు, పట్టణ వార్డుల్లో సామాజిక సేవ చేస్తున్న యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

గంజాయి, డ్రగ్స్, మత్తు ఇంజక్షన్లు వంటి నిషేధిత మత్తు పదార్థాల వినియోగం ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా పోలీసు శాఖకు వెంటనే తెలియజేయాలని సూచించారు.

సరైన పత్రాలు లేని లేదా దొంగిలించిన వాహనాలను ఉంచుకోవడం నేరమని హెచ్చరించారు. అలాగే పట్టణం, మండలంలోని గ్రామాలు, వార్డులు, చౌరస్తాలు, గల్లీల్లో యువకులు గుమిగూడి సమావేశాలు నిర్వహిస్తూ గొడవలకు పాల్పడినా, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని తెలిపారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పిల్లలు పాఠశాల, కళాశాల సమయం అనంతరం చదువుపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, భావి భారత పౌరులను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని కోరారు.

గ్రామాలు, పట్టణాల ప్రధాన వీధులు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు వేగవంతంగా సాగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.