పోడు రైతులను కులం పేరుతో దూషించారంటూ ఎఫ్‌ఆర్‌ఓపై ఫిర్యాదు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన రైతుల డిమాండ్

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో అటవీ హక్కు పత్రాలు కలిగి పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులను అటవీ అధికారులు వ్యవసాయం చేయనివ్వకుండా ట్రాక్టర్‌ను రేంజ్ కార్యాలయానికి తరలించారని రైతులు ఆరోపించారు.

ఈ విషయమై ఆదివారం ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వెళ్లి స్థానిక ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ప్రశ్నించగా, ఆయన కనీస మర్యాద పాటించకుండా కులం పేరుతో దూషించారని రైతులు ఆరోపించారు. “మీ జాతి మారదు”, “మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పండి”, “ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నాకు భయం లేదు”, “మళ్లీ కార్యాలయానికి వస్తే సిబ్బందితో బయటకు గెంటిస్తాను” అంటూ దురుసుగా మాట్లాడినట్లు వారు తెలిపారు.

దీంతో ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త ఆధ్వర్యంలో పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులు, గ్రామస్తులు కడెం ఎస్సై సాయికిరణ్, ఖానాపూర్ సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి గిరిజన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ పోడు సాగు గిరిజన రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.