గంగానమ్మ తల్లికి ఆషాఢ సారె సమర్పణ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కిలేశపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ తల్లికి భక్తులు ఆదివారం ఆషాఢ సారెను సమర్పించారు. తొలుత కృష్ణానది తీరాన విశేష అర్చన, మంగళ ద్రవ్య సమర్పణ, హారతి, 108 బిందెలతో పవిత్ర నది తీర్థ స్వీకరణ, కృష్ణా జలాలతో గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మ వారికి 108 బిందెల నదీ తీర్థంతో పంచామృత అభిషేకము, కుంకుమార్చన జరిపించారు. అమ్మ వారికి భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, గోరింటాకు, వివిధ రకాల పండ్లు, స్వీట్స్ సమర్పించారు. సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


