కర్నూలు జిల్లాకు తాగునీటి వరం..

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రతి గ్రామీణ వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీరు (55 LPCD) అందించాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో మొత్తం 11 గ్రామీణ తాగునీటి పథకాలకు రూ.1,769.05 లక్షలు (రూ.17.69 కోట్లు) అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో 10 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు (SVS), ఒక మల్టీ విలేజ్ స్కీమ్ (MVS) ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పథకాల ద్వారా సురక్షిత తాగునీటిని ఇంటింటికీ చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్న గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలు రూపొందించింది.

పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు రూ.557.35 లక్షలు ప్రతిపాదించారు. మద్దికెర మండలంలోని బొజ్జినాయునిపేటకు రూ.69.42 లక్షలు, పత్తికొండ మండలంలోని చక్కరాళ్లకు రూ.85.50 లక్షలు, చందోలికి రూ.83.70 లక్షలు కేటాయించారు. తుగ్గలి మండలంలోని బాట తండాకు రూ.49.60 లక్షలు, మిట్ట తండాకు రూ.63.54 లక్షలు, రోల్లపాడుకు రూ.40.80 లక్షలు, పెండేకల్ ఆర్‌.ఎస్‌కు రూ.79.74 లక్షలు ప్రతిపాదించారు. వెల్దుర్తి మండలంలోని ఎల్‌.కొట్టాలకు రూ.85.05 లక్షలు అంచనా వ్యయంగా నిర్ణయించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మూడు కీలక తాగునీటి పథకాలకు రూ.1,211.70 లక్షలు ప్రతిపాదించారు. నందవరం మండలంలోని ఇబ్రహీంపురానికి రూ.129.60 లక్షలు, కనకవీడుకు రూ.181.10 లక్షలు కేటాయించారు. అదేవిధంగా బనవాసిని కేంద్రంగా తీసుకుని మరో ఆరు గ్రామాలకు మల్టీ విలేజ్ స్కీమ్‌ను రూ.901 లక్షల అంచనా వ్యయంతో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ఒకే నీటి సరఫరా వ్యవస్థతో ఏడు గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ ప్రతిపాదనల ప్రకారం జిల్లాలో మొత్తం 11 పనుల్లో 10 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు, ఒక మల్టీ విలేజ్ స్కీమ్ అమలుకానున్నాయి. మొత్తం రూ.1,769.05 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీటిని అందించడం.

కర్నూలు జిల్లా భౌగోళిక పరిస్థితుల కారణంగా అనేక గ్రామాలు ఇప్పటికీ భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాయి. వేసవి కాలంలో భూగర్భ జలమట్టాలు పడిపోవడం, ఫ్లోరైడ్, ఉప్పుదనం వంటి సమస్యలు తాగునీటి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ముఖ్యంగా తండాలు, మారుమూల గ్రామాల్లో ప్రతి ఏడాది తాగునీటి కొరత ఎదురవుతోంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త సింగిల్ విలేజ్, మల్టీ విలేజ్ నీటి సరఫరా పథకాలు గ్రామీణ ప్రాంతాలకు దీర్ఘకాలిక పరిష్కారంగా మారనున్నాయి. ఒక్కో గ్రామానికి ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, బనవాసి కేంద్రంగా బహుళ గ్రామాలకు నీటిని సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

ముఖ్యంగా రూ.901 లక్షలతో బనవాసి మల్టీ విలేజ్ స్కీమ్, రూ.181.10 లక్షలతో కనకవీడు తాగునీటి పథకం, రూ.129.60 లక్షలతో ఇబ్రహీంపురం తాగునీటి పథకం అత్యధిక వ్యయంతో ప్రతిపాదించిన పనులుగా నిలిచాయి. అదే సమయంలో బాట తండా, మిట్ట తండా, రోల్లపాడు, పెండేకల్ ఆర్‌.ఎస్‌. వంటి చిన్న గ్రామాలు, తండాలకు కూడా ప్రత్యేక పథకాలను ప్రతిపాదించడం ద్వారా గ్రామీణ తాగునీటి భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పరిపాలనా అనుమతులు, టెండర్ ప్రక్రియలు పూర్తయిన అనంతరం పనులు ప్రారంభమైతే పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో వేలాది మంది గ్రామీణ ప్రజలకు ప్రమాణాలకు అనుగుణమైన సురక్షిత తాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.