మహబూబ్‌నగర్‌లో జనసేన ఆత్మీయ సమ్మేళనం
- భారీ బైక్ ర్యాలీ.. బోనాలతో రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి మేడ రామకృష్ణకు పిస్తా హౌస్ నుంచి తెలంగాణ చౌరస్తా, క్లాక్ టవర్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అమ్మవారి బోనాలతో నాయకులను ఘనంగా ఆహ్వానించారు.
సమ్మేళనంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మేడ రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆరు సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపడతామని చెప్పారు.
రాబోయే రోజుల్లో వలస జిల్లాగా పేరున్న పాలమూరు ప్రాంతంలో గ్రామ, మండల స్థాయిలో ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దుంపటి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, గడాల శ్రీనివాస్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మచ్చ సుధాకర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ నాయకుడు వంగా లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకుడు పి.ఆర్. రాఘవేందర్, రాష్ట్ర మహిళా నాయకురాలు తనుజ రెడ్డి, వీర మహిళా విభాగం నాయకురాలు గుమ్మడి శ్రీవళ్లి, నల్గొండ ఇన్‌చార్జి మేకల సతీష్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రేమ్ గాంధీతో పాటు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థులు, జనసైనికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
