మావిగన్ ప్రతిపాదనకు ప్రజల సంపూర్ణ మద్దతు..
- రాజధానిపై చంద్రబాబు వైఖరిలో మార్పు
- విజయవాడ, గన్నవరం కూడా రాజధానిలో భాగమేనని ఇప్పుడు అంగీకరిస్తున్నరు
- అమరావతిలో పేదలకు ఇళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..
విజయవాడ, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) అభివృద్ధి భావనకు ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందని, దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు.
విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ‘మావిగన్’ ప్రతిపాదనను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి అంటే గుంటూరు, విజయవాడ కూడా అని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు దూరంగా ఉండే ప్రాంతం కాకుండా, ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలనే రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం విమానాశ్రయం గురించి గతంలో మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు వాటిని రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రస్తావిస్తున్నారని అవినాష్ విమర్శించారు. అమరావతి పేరుతో ఇప్పటికే రూ.47 వేల కోట్లకు పైగా వ్యయం చేశారని, ఆ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమరావతి ప్రాంతంలో 51 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని, 1,400 ఎకరాలను మహిళల పేర్లపై నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0 కింద అమరావతి ప్రాంతానికి ఎందుకు ప్రతిపాదనలు పంపలేదో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అనేక ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తోందని అవినాష్ అన్నారు. బోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కూడా వైఎస్ జగన్ హయాంలోనే శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టు అభివృద్ధిలో ఆయన పాత్రను విస్మరించలేమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ ఆలోచనలకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
