ఆర్‌ఆర్‌బీ పరీక్షార్థులకు ప్రత్యేక రైళ్లు..
- పలాస–విజయవాడ మధ్య జనసాధారణ స్పెషల్ సర్వీసులు
- ఆగస్టు 2 నుంచి 6 వరకు నాలుగు ట్రిప్పులు.. రిజర్వేషన్ అవసరం లేదు
- విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం మీదుగా ప్రత్యేక రైళ్ల నిర్వహణ
విజయవాడ, ఆంధ్రప్రభ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ తీర రైల్వే పలాస–విజయవాడ మధ్య ప్రత్యేక జనసాధారణ (అన్‌రిజర్వ్డ్) స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ప్రజాసంబంధాల అధికారి నుస్రత్ ఎం. మండ్రుప్కర్ తెలిపారు. రైలు నెం. 07067 పలాస–విజయవాడ స్పెషల్ ఆగస్టు 2 నుంచి 5 వరకు ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు నడుస్తుంది. పలాస నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు మీదుగా మరుసటి రోజు రాత్రి 1 గంటకు విజయవాడ చేరుకుంటుంది.
రైలు నెం. 07068 విజయవాడ–పలాస స్పెషల్ ఆగస్టు 3 నుంచి 6 వరకు ప్రతిరోజూ నడుస్తుంది. విజయవాడ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 12 ఐసీఎఫ్ కోచ్‌లు ఉండగా, అందులో 10 సాధారణ (జనరల్) బోగీలు, 2 ఎస్‌ఎల్‌ఆర్ బోగీలు ఉంటాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
