ఈ రహదారికి దారేది..?
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లే పోచమ్మ చెరువు ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి.. బురదమయంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ఒకటైన ఈ రహదారిపై కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ వందలాది మంది ఈ మార్గాన్ని వినియోగిస్తున్నప్పటికీ రహదారి మరమ్మతులపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి రహదారి బురదగుంటగా మారి ప్రమాదాలకు కారణమవుతోందని, అత్యవసర సేవలకు వెళ్లే వాహనాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.
