చిట్టీల పేరుతో రూ.21 లక్షల మోసం..!
- చిట్ డబ్బులు అడిగితే చంపేస్తామంటూ బెదిరింపు!
- చిట్ కంపెనీ మోసం బట్టబయలు..!
- చిట్టీ క్లోజ్… డబ్బులు మాత్రం ఇవ్వలేదు!
- రూ.25 లక్షల చిట్.. రూ.21 లక్షలు గల్లంతు!
నరసరావుపేట క్రైమ్, ఆగస్టు 1(ఆంధ్రప్రభ ) : చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి, గడువు ముగిసినా తిరిగి ఇవ్వకుండా ఒక బాధితుడిని మోసం చేసిన ఘటన నరసరావుపేటలో వెలుగుచూసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం కొత్తపేటకు చెందిన షేక్ మొహమ్మద్ జాఫర్ అలీ అనే బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై నరసరావుపేట డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. నరసరావుపేట పట్టణంలోని అరండల్ పేటలో ఉన్న ‘ఈశ్వర్ చిట్స్’ సంస్థలో ఆయన ₹25 లక్షల విలువైన చిట్టీ వేశారు. దీని కోసం నెలకు ₹50 వేల చొప్పున క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు.
ఈ చిట్ గ్రూపు 2019 సెప్టెంబర్లో ప్రారంభమై, 2024 లో క్లోజ్ అయింది. చిట్టీ గడువు పూర్తయిన తర్వాత తనకు రావలసిన సొమ్మును ఇవ్వాల్సిందిగా బాధితుడు సదరు సంస్థ నిర్వాహకులను కోరారు. తన తల్లిదండ్రుల అనారోగ్య కారణాల దృష్ట్యా డబ్బులు అత్యవసరమని కోరినప్పటికీ, సంస్థ డైరెక్టర్లయిన షేక్ సర్ఫాజ్ అలీ, అబ్దుల్ బాషా, వారి తండ్రి షౌకత్ అలీలతో పాటు మేనేజర్ షేక్ సుభానిలు కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. పలుమార్లు ఆఫీసు చుట్టూ తిరిగిన తర్వాత 25-11-2024 న కేవలం ₹4 లక్షల రూపాయల చెక్కును మాత్రమే ఇచ్చి, మిగిలిన ₹21 లక్షల రూపాయలను ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు.బాకీ ఉన్న డబ్బుల గురించి నిలదీయగా నిర్వాహకులు బాధితుడిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, “మరోసారి ఆఫీస్ కి వస్తే బౌన్సర్లతో కొట్టించి చంపేస్తాం” అని ప్రాణ బెదిరింపులకు దిగారు.

ఈ తీవ్ర మనస్తాపం కారణంగా బాధితుడి తండ్రి షేక్ మహబూబ్ సుభాని మరణించారని, ప్రస్తుతం తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర్ చిట్ ఫండ్ నిర్వాహకులు గతంలోనూ ఇలాగే చాలా మందిని మోసం చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తనకు రావలసిన ₹21 లక్షల నగదును ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు షేక్ మొహమ్మద్ జాఫర్ అలీ పోలీసులను ఆశ్రయించారు.
