పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: ఎండీ అబ్బాస్

సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం

పరకాల, ఆంధ్రప్రభ: పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. శనివారం పరకాలలో సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమైన సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరుడు కామ్రేడ్ రౌతు మనోహర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జరిగిన శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం కారణంగా అనేక దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని, ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే సోషలిజం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సామ్రాజ్యవాద దేశాలు పేద దేశాల సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అధిక సుంకాలు విధిస్తూ ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. వాటిని వ్యతిరేకించే దేశాలపై యుద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇరాన్–ఇరాక్ యుద్ధం చమురు నిక్షేపాల కోసమే జరుగుతోందని, అమెరికా ఇరాక్‌కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని ఎండీ అబ్బాస్ ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలను అణచివేస్తున్నారని అన్నారు.

రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు నష్టం కలిగించే విధంగా చట్టాలు తీసుకొచ్చారని ఆరోపిస్తూ, వాటికి వ్యతిరేకంగా ఆగస్టు 20న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేపడతామని, వాటిలో కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ శిక్షణలో “వర్గాలు – వర్గపోరాటాలు” అంశంపై సీపీఎం రాష్ట్ర నాయకుడు ముడ్ శోభన్ నాయక్ బోధించారు. శిక్షణ తరగతులకు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కే. లింగయ్య, పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్, నాయకులు గాదె రమేష్, బొచ్చు ఆదాం, జి. మహేందర్, బి. నారాయణ, ప్రమోద్, దాసరి అనిత, శనిగారపు సంధ్య, రౌతు శ్రీలత, చరణ్, మోహన్, ఏసుబ్ తదితరులు పాల్గొన్నారు.