గంటల్లోనే వీడిన మిస్టరీ..

కోడుమూరు, ఆంధ్రప్రభ : తాళాలు యథాతథంగానే ఉన్నాయి.. బీరువా కూడా అలాగే ఉంది.. కానీ లోపల ఉండాల్సిన పెన్షన్ సొమ్ములో రూ.60 వేల నగదు కనిపించలేదు. కోడుమూరు పట్టణంలోని తొలి సచివాలయంలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి మాయమైన నగదును పూర్తిగా రికవరీ చేసి సచివాలయ అధికారులకు అప్పగించారు.

కోడుమూరు పట్టణంలోని 1వ సచివాలయంలో శనివారం పెన్షన్ పంపిణీకి సిద్ధం చేసిన మూడు లక్షల నగదులో రూ.60 వేల సొమ్ము మాయమైన ఘటన కలకలం రేపింది. తాళాలు వేసినట్లుగానే ఉన్నప్పటికీ బీరువాలోని నగదు తగ్గిపోవడం అధికారులను ఆందోళనకు గురిచేసింది.

సచివాలయ సిబ్బంది బీరువాలోని నగదును తనిఖీ చేయగా రూ.60 వేల నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సచివాలయ సిబ్బందిని విచారించడంతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. గంటల వ్యవధిలోనే ఘటనను ఛేదించిన పోలీసులు మాయమైన రూ.60 వేల నగదును పూర్తిగా రికవరీ చేశారు.

రికవరీ చేసిన నగదును కోడుమూరు ఎస్‌ఐ డివై స్వామి సచివాలయ ఉద్యోగులకు అధికారికంగా అప్పగించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఎలా మాయమైంది?

బీరువాకు తాళాలు వేసినట్లుగానే ఉండడం, బలవంతపు చోరీ ఆనవాళ్లు లేకపోవడంతో నగదు ఎలా మాయమైందనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నగదు ఎవరి వద్దకు వెళ్లింది, ఏ పరిస్థితుల్లో బయటకు వెళ్లిందనే అంశాలను విచారించి కేసును ఛేదించినట్లు సమాచారం.

విచారణ కొనసాగింపు..

నగదు రికవరీ అయినప్పటికీ, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదా ప్రమేయం ఉందనే అంశాలపై పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.