నల్లమట్టి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..

ఉండవల్లి చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు..
పత్రాలు లేని వాహనాలపై కఠిన హెచ్చరిక


ఆంధ్రప్రభ, తాడేపల్లి : రాజధాని ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు నల్లమట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు హెచ్చరించారు.

ఉండవల్లి చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నల్లమట్టి, గ్రావెల్ తరలిస్తున్న లారీలను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేసి, సరైన అనుమతులు లేకుండా ఖనిజాలను తరలించడం చట్టరీత్యా నేరమని డ్రైవర్లు, యజమానులకు స్పష్టం చేశారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు, కార్లను కూడా తనిఖీ చేశారు. రాత్రి వేళ సరైన పత్రాలు లేదా సముచిత కారణాలు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనధికారిక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని సీఐ వీరేంద్రబాబు స్పష్టం చేశారు.