AP Deputy CM | పులి మృతిపై సమగ్ర విచారణకు పవన్ ఆదేశం..
వేట, విషప్రయోగం కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి..
AP Deputy CM | అమరావతి/గిద్ధలూరు, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతం తన దృష్టికి వచ్చింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించానన్నారు.

అది సహజ మరణమా? లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించాను. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
