అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆపరేషన్…
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు–రాజమండ్రి–కాకినాడ–చింతూరు పాపికొండ నేషనల్ పార్క్ పరిధిలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ ముమ్మర చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన నిపుణుల ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ టి. జ్యోతి, జిల్లా అటవీ శాఖ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు.

ప్రస్తుతం పులి కొండలు, గుట్టలతో కూడిన కష్టతరమైన ప్రాంతాల్లో అత్యంత చాకచక్యంగా సంచరిస్తోందని, దీంతో దానిని పట్టుకోవడం సవాలుగా మారిందన్నారు. అయితే పులి మైదాన ప్రాంతాల్లోకి వచ్చిన వెంటనే రసాయన పద్ధతిలో మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
కండ్రికగూడెం, లంకపాకల, రంగాపురం, నూతిరామన్నపాలెం, గుంజవరం, మెరకగూడెం, రవ్వవారిగూడెం, పాలకుంట, దండిపూడి, పి.ఆర్.గూడెం, ఉప్ప్రెల్లి, ముంజులూరు తదితర గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
కన్నాపురం, పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సిబ్బంది పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచి బంధించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సందీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
