అంతర్గాం భూముల అన్యాక్రాంతం పై ఆరా

  • భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్
  • తాసిల్దార్ కార్యాలయంలో సమీక్ష

గోదావరిఖని, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మాణం చేసిన అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు భూముల అన్యక్రాంతంపై జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ ,స్పిన్నింగ్, వీవింగ్ మిల్లుల లిక్విడేటర్ శ్రీరాములు అంతర్గంలో పర్యటించారు.

స్పిన్నింగ్ వీవింగ్ మిల్ ఆధీనంలో ఉన్న భూములను అంతర్గాం తాసిల్దార్ ప్రసాద్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనం లో ఉన్న భూమి ఎంత..? మిల్లు కార్మికుల ఇండ్ల కోసం కేటాయించబడ్డ భూమి ఎంత..!? అసలు అన్యాక్రాంతం అయినా భూమి ఎంత…? అన్న వివరాలను అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆరా తీశారు.

మిల్లు భూములకు సంబంధించి రికార్డులను స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో మిల్లు భూములకు సంబంధించి హద్దుల వివరాలను తాసిల్దార్ నుండి సేకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే క్లియర్ చేయాలి అన్నారు.

అదేవిధంగా సర్ ప్రక్రియ కార్యక్రమం సాధ్యమైనంత తొందరలో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం భారీ వర్షాలతో గంట గంటకు పెరుగుతున్న శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతిని అదనపు కలెక్టర్ శ్రీరాములు పరిశీలించారు. ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో… దిగువకు విడుదల చేస్తున్న నీటి వివరాలను తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా మిల్లు భూములను అన్యకరాంతమైనట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు సదరు కబ్జాదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తాసిల్దార్ ప్రసాద్ తెలిపారు.

దశాబ్దాల క్రితం ఇక్కడ మిల్లులు ఏర్పాటు చేసినప్పుడు కేటాయించబడ్డ భూమి 553 ఎకరాలు కాగా… ప్రస్తుతం 324 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా భూమిలో వందలాదిమంది అప్పటి కార్మిక కుటుంబాల కోసం ఇండ్ల నిర్మాణాలు చేశారు.

అదికాక ఇదే మిల్లుకు సంబంధించి ఆధీనంలో ఉన్న భూమిలో కొంత భాగం అన్యక్రాంతమైనట్లు ఆరోపణలు వ్యక్తం కావడం… జిల్లా రెవెన్యూ యంత్రాంగం సైతం గుర్తించడం… విరసి స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్ భూముల పరిశీలన చేయడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే కబ్జాదారులపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న అంశాలపై ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది.