సీరియల్ చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లు సహా రూ.1.83 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నాలుగు కేసుల చోరీ సొత్తు గుర్తింపు..
యజమానుల కోసం మరో రూ.లక్ష విలువైన వస్తువులు
జీఆర్‌పీ–ఆర్‌పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో నిందితుడు పట్టివేత

( కేదారేశ్వరరావు పేట, ఆంధ్రప్రభ) : విజయవాడ రైల్వే స్టేషన్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రూ.1.83 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే ఐజీపీ బి. రాజకుమారి ఆదేశాలు, విజయవాడ రైల్వే జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పర్యవేక్షణలో డీఎస్పీ ఆర్.జి. జయసూర్య ఆధ్వర్యంలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ విజయం సాధించారు.

జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి. రమణ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆలీ బేగ్ బృందాలు ప్లాట్‌ఫాం నంబర్–10 ఉత్తర దిక్కున ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మాచవరం ప్రాంతానికి చెందిన కొండక లక్ష్మణరావు (36)ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లు, డిజిటల్ చేతి గడియారం, ఎన్‌డీఆర్‌ఎఫ్ గుర్తింపు కార్డు, ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు కార్డులు తదితర వస్తువులు లభించాయి.

పరిశీలనలో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో నాలుగు చోరీ కేసులకు సంబంధించిన డెల్ ల్యాప్‌టాప్‌, మోటో జీ–34 మొబైల్‌, రెండు ఒప్పో మొబైల్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.83,700గా అంచనా వేశారు. అదనంగా యజమానులు ఇంకా గుర్తించని హెచ్‌పీ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌, రెండు శామ్‌సంగ్ మొబైల్‌ ఫోన్లు, ఒక వివో మొబైల్‌, డిజిటల్ వాచ్‌, పలు గుర్తింపు కార్డులు, బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.లక్షగా పోలీసులు తెలిపారు. మొత్తంగా రూ.1,83,700 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిపై నమోదైన కేసుల్లో స్వాధీనం చేసిన సొత్తును నమోదు చేసి, కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు జీఆర్‌పీ అధికారులు తెలిపారు. ఈ కేసును ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి. రమణతో పాటు దర్యాప్తులో పాల్గొన్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.