కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, ఆంధ్రప్రభ: అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వమే చిరునామా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని 1వ వార్డు అనాసాగరంలో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ‘అభివృద్ధి–సంక్షేమానికి రెండేళ్ల నమ్మకం.. కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు’ పేరుతో రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రూపు దాల్చనుందని, ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.