ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి
ప్రధాని మోదీ పర్యటనపై మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష
భద్రత, ట్రాఫిక్, ప్రజా సౌకర్యాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
భీమిలి, ఆంధ్రప్రభ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భీమిలిలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సహచర మంత్రులు పి. నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పులివర్తి నాని, భాష్యం ప్రవీణ్, ముత్తుముల అశోక్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ల నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, వేదిక ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని అత్యంత పకడ్బందీగా పూర్తి చేసి, ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్ర అభివృద్ధికి నూతన ద్వారంగా నిలవనుందని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ విమానాశ్రయం మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
