విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు..
ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీ వద్ద రెంకోన వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
వాగుకు అవతలి ఒడ్డున ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను, పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల రాకపోకలు, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అధికారులకు పలు సూచనలు
వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక మహేందర్, వైస్ చైర్మన్ మహ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు బొప్పరపు సత్యవతి, చిన్నం సత్యనారాయణ, తొడసం ఇందిరా, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాత, ఎంఈవో సంధ్యారాణి, నాయకులు గొర్రె గంగాధర్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
