అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్- ఏఎస్ఐ సంజీవయ్య ఉద్యోగ విరమణ..ఘనంగా సత్కారం

ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ

గోదావరిఖని, జులై 31 (ఆంధ్రప్రభ): సమర్థవంతమైన సేవలతో మంచి గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్- ఏఎస్ఐ సంజీవయ్యను శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ అనేది సహజమైన ఘట్టమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన సంజీవయ్య సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా మీకు ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని, పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, ఆర్ఐ రమేష్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, సీసీ సందీప్ లు పాల్గొన్నారు.