భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ

44 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

భద్రాచలం, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుండటంతో శుక్రవారం ఉదయం 10.14 గంటలకు జిల్లా యంత్రాంగం తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఉదయం గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.80 అడుగుల వద్ద నమోదైంది. ప్రస్తుతం సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉద్ధృతి కొనసాగితే నీటిమట్టం 50 అడుగులకు చేరే అవకాశమూ ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు ఆలస్యం చేయకుండా సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు.