Tirumala | ఏడుకొండల వాడా.. ఆ పాపాత్ములెవరో?
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ కల్తీ
- కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక
- నెయ్యిలో ‘వెజిటబుల్ ఆయిల్’ కల్తీ
- గుర్తించకుండా కొన్ని రసాయనాల వాడకం
ప్రసాదాల తయారీలో కల్తీ లేదన్న భావన భక్తుల్లో ఇన్నాళ్లు ఉండేది. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలతో ఆ నమ్మకం సైతం ఆవిరైపోయింది. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇలా అన్నిటినీ కల్తీ చేస్తున్నారు. ఇప్పడు దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి వెనుకాడటం లేదు. అయితే తిరుమల లడ్డూను నిజంగానే కల్తీ చేశారా..? లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారా..? వాడితే ఆ పాపం ఎవరిది..? అసలు దోషులు ఎవరు..? వారికి ఆ ఏడుకొండలవాడు తగిన శిక్ష వేస్తారా..? లేదంటే అసలు దోషులు తప్పించుకొని కింది స్థాయివారు శిక్షకు గురవుతారా..? అనేది తిరుమల భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతాయి.

Tirumala |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో లడ్డూ ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. అయితే గత వైసీపీ హయాంలో ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని ఆరోపణలు వచ్చాయి. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని, ఇందులో జంతుకొవ్వు, పందికొవ్వు కలిశాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

సిట్ ఏమన్నదంటే..?
సిట్ చార్జిషీట్ ప్రకారం.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ‘వెజిటబుల్ ఆయిల్’ కల్తీ జరిగిందని, నాణ్యతా పరీక్షల్లో అది బయటపడకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కలిపారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. జంతువుల కొవ్వు, చేప నూనె వంటివి ఉండే అవకాశాలు దాదాపు లేవని ల్యాబ్ నివేదికలను పేర్కొంటూ సిట్ అందులో ప్రస్తావించింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో నెయ్యి కల్తీ ద్వారా రూ.234 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొంటూ, అందుకు బాధ్యులుగా కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి మొత్తం 36 మందిపై పలు కేసులు నమోదుచేసింది సిట్.
సిట్ ప్రభుత్వానికి రాసిన 14 పేజీల లేఖలోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారని పేర్కొంది. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019 ముందున్న కఠిన నిబంధనలను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని సడలించారు. మూడేళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. టర్నోవర్ మొత్తాన్ని రూ. 250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు.

నేరస్థులను వదలం : మంత్రి పయ్యావుల కేశవ్
తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిపై విచారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అడ్వకేట్ జనరల్‌ను కేబినెట్ న్యాయ సలహా కోరింది. చార్జిషీట్‌లో లేకున్నా నేరస్థులను వదలమని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

లడ్డూలో వినియోగించింది నెయ్యే కాదు : పవన్‌కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికలోని అంశాలను వైసీపీ కప్పిపుచ్చి.. విష ప్రచారం చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని విమర్శించారు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదన్న పవన్ కళ్యాణ్.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

బదిలీ వేటు..
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాడు ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్, నెయ్యి టెండర్ల నిబంధనలను సడలించడంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సిట్ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. తప్పుచేస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఈ చర్య ద్వారా గట్టి సంకేతాలు పంపింది.

రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు
రమణ దీక్షితులు స్పందించారు. “లడ్డూలో నాటి కమ్మని వాసన లేదు, నాణ్యత లేదని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదమే కాదు… స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా కల్తీ అయింది. ఇది మహా పాపం. మా చేతులతోనే స్వామివారికి కల్తీ నెయ్యితో చేసిన నైవేద్యం పెట్టాల్సి రావడం మా జీవితంలో మరిచిపోలేని బాధ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ నాణ్యత మాత్రమే కాదు… పరిమాణం కూడా సగానికి సగం తగ్గించారని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ఇది అపచారం అని ఎంత చెప్పినా అప్పటి ఈవో గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు” అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కాలంలో లడ్డూ పరిమాణం తగ్గించినప్పుడు తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. స్వామివారికి ఎంత పరిమాణంలో నైవేద్యం పెట్టాలన్నది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుందని, దానిని ‘దిట్టం’ అంటారని రమణ దీక్షితులు వివరించారు. “దిట్టం ప్రకారం ఎక్కువ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చేయవలసినదానికంటే తక్కువ చేయడం మాత్రం అపచారం. మొన్నటి వరకూ అదే జరుగుతోంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు” అని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి… దిట్టం ప్రకారమే ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
