నేటితో పంటల బీమా నమోదు గడువు ముగింపు..
- రైతులు చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలి
- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్
నరసరావుపేట, ఆంధ్రప్రభ : పంటల బీమా నమోదు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో రైతులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులను రక్షించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని.. పంటకు బీమా రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్నా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోకుండా పంటల బీమా రక్షణగా నిలుస్తుందని చెప్పారు.
ఈ అవకాశాన్ని ఏ రైతూ కోల్పోవద్దని.. సమీపంలోని సీఎస్సీ (CSC) కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పీఎంఎఫ్‌బీవై (PMFBY) పోర్టల్ ద్వారా వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి
రేపు జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రక ఘట్టమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వస్తోందని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా పూర్తయిందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు కొత్త ఊపు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం మరో మైలురాయిగా నిలుస్తుందని.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
