జ్ఞానాన్ని బోధించడం కాదు

జ్ఞానదాహాన్ని రగిలించడమే గురుత్వం

“గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లవచ్చు… కానీ నీళ్లు తాగించలేం.”
తరతరాలుగా వినిపిస్తున్న ఈ సామెతలో గొప్ప జీవన సత్యం దాగి ఉంది. అవకాశాన్ని కల్పించడం వరకు మన చేతిలో ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం వ్యక్తి చైతన్యంపై ఆధారపడి ఉంటుంది.
అయితే ఈ సామెతను ఇక్కడితో ముగిస్తే గురువు పాత్రను చాలా చిన్నదిగా చేసినట్టే అవుతుంది.
నిజమైన గురువు కేవలం దారి చూపేవాడు కాదు. ఆ దారిలో నడవాలనే తపనను కలిగించేవాడు.
నిజమైన గురువు పుస్తకం తెరిచి పాఠం చెప్పడు. మనసు తెరిచి జీవితాన్ని చూపిస్తాడు.
అందుకే నా దృష్టిలో ఈ సామెతకు కొనసాగింపు ఉండాలి.
“గుర్రాన్ని నీరు తాగించే వాడే నిజమైన గురువు.”
అది బలవంతంగా కాదు.
దానికి దాహం కలిగించడం ద్వారా.
జ్ఞానదాహమే విజయానికి తొలి మెట్టు
గుర్రాన్ని కొంత దూరం పరుగెత్తిస్తే దానికి దప్పిక వేస్తుంది. ఉప్పు తినిపించినా దాహం వేస్తుంది. అప్పుడు అది నీళ్ల కోసం తహతహలాడుతుంది.
విద్యార్థి కూడా అంతే.
పాఠాలు బలవంతంగా వినిపించవచ్చు.
పరీక్షలు రాయించవచ్చు.
మార్కులు తెప్పించవచ్చు.
కానీ నేర్చుకోవాలనే ఆకలి, తెలుసుకోవాలనే దాహం, ఎదగాలనే తపన కలిగించలేకపోతే విద్య అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.
శ్రీకృష్ణుడు అర్జునికి ఇచ్చింది ఆజ్ఞ కాదు… ఆత్మవిశ్వాసం
కురుక్షేత్రంలో అర్జునుడు నిరాశతో ఆయుధాలు వదిలేశాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు రాజాజ్ఞ ఇవ్వలేదు.
శిక్షించలేదు.
అతని మనసును అర్థం చేసుకున్నాడు.
సందేహాలను తొలగించాడు.
ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
అందుకే భగవద్గీత చివర్లో అర్జునుడు ఇలా అంటాడు—
“నష్టో మోహః… కరిష్యే వచనం తవ.”
“నా మోహం తొలగిపోయింది. ఇప్పుడు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను.”
గురువు విజయమంటే ఇదే.
శిష్యుడు గురువును అనుసరించడం కాదు.
తనను తాను తెలుసుకోవడం.
నారదుడి ఒక్క ప్రశ్న… వాల్మీకిని సృష్టించింది
దొంగ రత్నాకరుడికి నారదుడు పెద్ద ఉపన్యాసం చేయలేదు.
ఒక్క ప్రశ్న అడిగాడు.
“నీవు చేస్తున్న పాపంలో నీ కుటుంబం భాగస్వాములవుతారా?”
ఆ ప్రశ్న అతని అంతరంగాన్ని కుదిపేసింది.
అదే ఆత్మపరిశీలనకు ఆరంభం.
అదే రత్నాకరుడిని మహర్షి వాల్మీకిగా మార్చింది.
కొన్నిసార్లు ఒక మంచి ప్రశ్న…
వందల ఉపన్యాసాల కంటే గొప్పది.
చాణక్యుడు చూసింది బాలుడిని కాదు… భావి చక్రవర్తిని
చంద్రగుప్తుడిలో నాయకత్వాన్ని గుర్తించిన చాణక్యుడు అతనికి కేవలం రాజకీయాలు నేర్పలేదు.
అసాధ్యం అనే మాటను మరచిపోయే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు.
గొప్ప గురువులు మన వర్తమానాన్ని చూడరు.
మన భవిష్యత్తును చూస్తారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన గురుత్వం
భారతరత్న, తత్వవేత్త, ఉపాధ్యాయుల్లో ఆదర్శప్రాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఇలా అన్నారు.
“నిజమైన గురువులు మనకు ఏమి ఆలోచించాలో కాదు… ఎలా ఆలోచించాలో నేర్పిస్తారు.”
ఈ ఒక్క వాక్యంలోనే గురుత్వం మొత్తం ఇమిడి ఉంది.
సమాధానాలు చెప్పడం సులభం.
ఆలోచించే శక్తిని పెంపొందించడం గొప్పది.
అందుకే ఆయన జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చెప్పిన గురువు నిర్వచనం
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం విద్యార్థుల గురించి చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పారు.
“దేశంలోని అత్యుత్తమ మేధావులు కొన్నిసార్లు తరగతి గదిలో చివరి బెంచ్‌లో కూడా కూర్చుని ఉండవచ్చు.”
ఈ మాట ప్రతి గురువుకు ఒక హెచ్చరిక.
ప్రతి విద్యార్థిలో ఒక ప్రతిభ ఉంటుంది.
దాన్ని గుర్తించడం గురువు బాధ్యత.
అలాగే ఆయన మరో సందర్భంలో చెప్పారు.
“కలలు కనండి… ఆ కలలు ఆలోచనలుగా మారతాయి. ఆలోచనలు కార్యాచరణగా మారతాయి.”
కలలు కనడం నేర్పించేవాడే నిజమైన గురువు.
స్వామి వివేకానంద సందేశం
స్వామి వివేకానంద మాటల్లో—
“మనిషిలో ముందుగానే ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడమే విద్య.”
గురువు జ్ఞానాన్ని బయట నుంచి నింపడు.
లోపల ఉన్న సామర్థ్యాన్ని వెలికితీస్తాడు.
ఆధునిక విద్యకు కావలసింది ప్రేరణ
నేటి పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.
ప్రపంచమంతా వారి అరచేతిలో ఉంది.
కానీ జిజ్ఞాస తగ్గుతోంది.
పుస్తకాలు పెరుగుతున్నాయి.
చదివేవారు తగ్గుతున్నారు.
డిగ్రీలు పెరుగుతున్నాయి.
వ్యక్తిత్వం తగ్గుతోంది.
సమాచారం పెరుగుతోంది.
ప్రేరణ తగ్గుతోంది.
ఈ లోటును పూరించగలిగేది గురువు మాత్రమే.

ప్రపంచంలో ప్రతి వృత్తి ఒక నిపుణుడిని తయారు చేస్తుంది.
కానీ గురువు మాత్రమే ఒక మనిషిని తయారు చేస్తాడు.
అతను పాఠాలు చెప్పడు.
వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాడు.
అతను ఉద్యోగార్థిని తయారు చేయడు.
జీవితార్థిని తయారు చేస్తాడు.
అందుకే—
గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లడం ఒక బాధ్యత.
దానికి దాహం కలిగించడం ఒక నైపుణ్యం.
ఆ దాహాన్ని జ్ఞానదాహంగా మార్చి, అది తనంతట తానే నీరు తాగేలా చేయడం… అదే గురువు మహోన్నతత్వం.
జ్ఞానాన్ని అందించేవాడు ఉపాధ్యాయుడు.
జ్ఞానదాహాన్ని రగిలించేవాడే నిజమైన గురువు.
అలాంటి గురువుల వల్లే వ్యక్తులు ఎదుగుతారు. వ్యక్తుల వల్లే సమాజం మారుతుంది. సమాజం మారితేనే దేశం పురోగమిస్తుంది.


– డా. ఎన్. బి. సుధాకర్ రెడ్డి
సైకాలజిస్ట్