TG | గద్దర్‌ను అవమానిస్తే తగిన శాస్తి చేస్తాం : సీఎం రేవంత్
రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
గద్దర్ ఎప్పుడూ కుటుంబం కంటే సమాజ శ్రేయస్సు కోసమే పని చేశారని… గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజానికి స్ఫూర్తిగా నిలిచేలా గద్దర్ అవార్డు రావాలన్నారు. గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం.. ప్రతి సంవత్సరం ఆయనను స్మరించుకోవడమే అని అన్నారు.
గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు. పద్మ అవార్డులు ఇవ్వాలని ఐదుగురి పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని గుర్తుచేశారు. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే.. కనీసం ఒక్క పద్మ అవార్డు కూడా ఇవ్వలేదరని మండిపడ్డారు. రాష్ట్రం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామన్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం రాగానే రాహుల్ గాంధీతో మాట్లాడి గద్దర్ కు పద్మ అవార్డు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.