Inquiry-Report-Ggh : జీజీహెచ్ లో నర్తనశాల Andhra Prabha Top Story
Inquiry-Report-Ggh : జీజీహెచ్ లో నర్తనశాల Andhra Prabha Top Story
- అతడికి లొంగాలి
- లేదో.. తిప్పలే తిప్పలు
- విచారణ కమిటీకి ఓ మహిళ కన్నీటి వ్యథ
- ఆంధ్రప్రభ కథనం పచ్చినిజం..
- విచారణలో తేటతెల్లం

( ఎన్టీఆర్ బ్యూరో,ఆంధ్రప్రభ)
విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో పారిశుద్ధ్య కార్మికులపై జరుగుతున్న వేధింపుల వ్యవహారంపై ఆంధ్రప్రభ వరుసగా వెలుగులోకి తీసుకొచ్చిన కథనాలకు విచారణలో బలం చేకూరినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు ఆసుపత్రి యాజమాన్యం నియమించిన విచారణ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సూపర్వైజర్ సోమరాజు ఏడాదికిపైగా తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించినట్లు సమాచారం.
nquiry-Report-Ggh : పదే పదే ఇతరులతో ….
తనను నేరుగా సంప్రదించకుండా మరో కార్మికుడు సతీష్ ద్వారా “నిన్ను ఇష్టపడుతున్నాడు… ఒక్కసారి రావాలని చెబుతున్నాడు” అంటూ పదేపదే కబుర్లు పంపిస్తూ ఒత్తిడి తీసుకొచ్చేవాడని ఆమె కమిటీకి బాధితురాలు వివరించినట్లు తెలిసింది. తాను ఆ ఒత్తిడికి లొంగకపోవడంతో విధుల్లో చిన్నచిన్న కారణాలు చూపిస్తూ వేధించడమే కాకుండా, అందరి ఎదుట పని సరిగా చేయడం లేదంటూ అవమానించేవాడని ఆమె వాపోయినట్లు సమాచారం. విచారణ సందర్భంగా మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు కూడా సూపర్వైజర్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం, చిన్న విషయానికే కేకలు వేయడం, భయభ్రాంతులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారిందని వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు వార్డుల్లో పరిశుభ్రత అంశాన్ని సాకుగా చూపుతూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ విభాగానికి చెందిన ఓ మేల్ నర్సు కూడా తమను అనవసరంగా వేధిస్తున్నాడని పలువురు మహిళా కార్మికులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
nquiry-Report-Ggh : వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ..
జీజీహెచ్ లో సూపర్ వైజర్‌తో పాటు మరో కార్మికుడు కూడా లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా కార్మికులు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభ ‘పారిశుద్ధ్య కార్మికులకు లైంగిక వేధింపులు’ శీర్షికతో ప్రచురించిన కథనం అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. అనంతరం స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. బాధితులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. కమిటీ సమర్పించిన నివేదికను జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు (డీఎంఈ) పంపనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. విచారణలో నమోదైన వాంగ్మూలాలు, సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి పరిపాలనా చర్యలపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జీజీహెచ్ వంటి కీలక ప్రభుత్వ వైద్యసంస్థలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలోనే వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
