ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ కొత్త రైల్వే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ నేతలు, తెలంగాణ ఎంపీలు–ఎమ్మెల్యేలు
నిర్మల్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ మధ్య ప్రతిపాదిత కొత్త రైల్వే మార్గానికి అనుమతులు మంజూరు చేసి, పనులను త్వరగా ప్రారంభించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.
ఈ బృందంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు, గోడం నగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి, నిర్మాణ పనులను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.
ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
