ఇంటింటికీ కూటమి ప్రభుత్వం.. ప్రజల్లో ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కనిపించడం ఆనందంగా ఉందన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పెన్షన్లు పొందుతున్న వారు ఉండటం, మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని, గత ఐదేళ్లలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు ఇప్పుడు కొత్త ఊపు వచ్చిందన్నారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి అన్ని రంగాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాబోయే రెండేళ్లలో లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని భరోసా ఇచ్చారు.
పర్యటనలో భాగంగా గ్రామస్తుల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకుని, స్థానికంగా పరిష్కరించగల అంశాలపై వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రజలు ఆయన చొరవను అభినందించారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలతో నందికొట్కూరు నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మహేష్ రెడ్డి, గ్రామ నాయకులు లోకానందరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ వెంకటశివుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
