ప్రశ్నించే పౌరుడే నిజమైన దేశభక్తుడు: భార్గవ్ వల్లూరు
- రాహుల్ గాంధీ ‘అంధభక్తి’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన
(విజయవాడ, ఆంధ్రప్రభ ) : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన “అంధభక్తి” అంశం భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భార్గవ్ వల్లూరు పేర్కొన్నారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, “అంధభక్తి దేనికోసం? ఎవరి కోసం? మీ కుటుంబాల భవిష్యత్తు కంటే గొప్పదా?” అనే ప్రశ్నను రాహుల్ గాంధీ దేశ ప్రజల మనసాక్షి ముందు ఉంచారని అన్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలు ఆలోచించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించకుండా, ప్రశ్నించకుండా విస్మరించడమే అసలైన అంధభక్తి అని రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా స్పష్టమైన సందేశం ఇచ్చారని భార్గవ్ వల్లూరు వ్యాఖ్యానించారు. పరీక్షల అక్రమాలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం వంటి ప్రజా సమస్యలపై యువత దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు.
“వాస్తవాలను అంగీకరించని ప్రతి వ్యక్తి అంధుడే.. ప్రశ్నించే ప్రతి పౌరుడే నిజమైన దేశభక్తుడు” అనే సందేశమే ఈ చర్చ సారాంశమని అన్నారు. భారత ప్రజాస్వామ్యం వ్యక్తి ఆరాధనతో కాకుండా వాస్తవాలను ప్రశ్నించే పౌరులతోనే మరింత బలపడుతుందని, యువత ఆలోచనలను ఎవరూ అణచలేరని తెలిపారు. ప్రతి భారతీయుడు తన కుటుంబంతో కలిసి దేశంలో జరుగుతున్న పరిణామాలు, జీవన ప్రమాణాల్లో మార్పులు, భావితరాల భవిష్యత్తుపై ఆలోచించి సమాధానాలు కోరాల్సిన సమయం ఆసన్నమైందని భార్గవ్ వల్లూరు పేర్కొన్నారు. “వ్యక్తులను కాదు… వాస్తవాలను నమ్మండి. ప్రచారాన్ని కాదు… ప్రజల జీవితాలను చూడండి. అంధభక్తిని కాదు… ఆలోచించే భారతాన్ని నిర్మిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.
