భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగ వేడుకలు
సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు చేసిన డీసీపీ దంపతులు
పాలకుర్తి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం భామ్లానాయక్ రాజీవ్ తండాలో గిరిజనుల అత్యంత పవిత్రమైన తీజ్ పండుగ వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి దంపతులు హాజరై సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తండా ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తీజ్ పండుగ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవాలైన సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాతకు తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మహిళలు, యువతులు సంప్రదాయ బంజారా వేషధారణలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్, తండా పెద్దమనిషి ఇస్లావత్ సమ్మయ్య నాయక్, పులచంద్, చందు, గట్టయ్య, రమేష్, తిరుపతి, అంజి, చిన్న, నగేష్, చియా, జగన్, సురేష్‌తో పాటు మహిళలు పాల్గొన్నారు.
