Sircilla | మొబైల్ రికవరీలో సిరిసిల్ల టాప్..

Sircilla | మొబైల్ రికవరీలో సిరిసిల్ల టాప్..
- జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు
- సాంకేతికత వాడుతూ.. విశిష్ట విజయం
- 78శాతం మొబైల్ రికవరీ రేటు
- దక్షిణాది రాష్ట్రాల్లో జిల్లాదే తొలి స్థానం
- పోలీస్ పనితీరును ప్రశంసించిన డీజీపీ శివధర్ రెడ్డి
Sircilla | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : మొబైల్ రికవరీలో రాజన్న సిరిసిల్ల టాప్ లేపింది.. జిల్లా పోలీసులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది విశిష్ట విజయాన్ని దక్కించుకున్నారు. సీఈఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ 78 శాతం మొబైల్ రికవరీ రేటు సాధించి, దక్షిణాది రాష్ట్రాలలో సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ట్రాకింగ్ విధానాలు, సీఈఐఆర్ అప్లికేషను సమర్థంగా ఉపయోగించడం ద్వారా ఇప్పటివరకు మొత్తం 2,286 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేస్తూ 78 శాతం రికవరీ రె టు సాధించడం విశేషం. అద్భుతమైన పనితీరుతో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులను అభినందిస్తూ ప్రశంసలు కురిపించి, హర్షం వ్యక్తం చేశారు. మొబైల్ రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా లెవెల్లో మొదటి స్థానం జిల్లా పోలీసులకు దక్కడం గర్వకారణమన్నారు. ఈ నెల 12వ తేదీన కేరళ లోని ఎర్నాకులంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హాజరై సీఈఐఆర్ ద్వారా మొబైల్ ఫోన్ రికవరీలో అనుసరించిన ఉత్తమ విధానాలు, కార్యాచరణ వ్యూహాలు, విజయవంతమైన అనుభవాలను కాన్ఫరెన్స్ వివరించి అవార్డును స్వీకరించనున్నారు.

పోలీసుల పనితీరు గర్వ కారణం…
జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే మాట్లాడుతూ మొబైల్ ఫోన్ రికవరీలో ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి స్థానం సాధించడం గర్వ కారణమని, ఇది తెలంగాణ పోలీసుల పనితీరు, నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యతాయుతంగా, తక్షణ స్పందనతో వ్యవహరించడం, సీఈఐఆర్ వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించడం, సాంకేతిక నైపుణ్యంతో ట్రాకింగ్ నిర్వహించడం వల్లే ఇలాంటి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు సీఈఐఆర్ పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్ రికవరీలో విశేష ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్ తోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలను అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తూ, ప్రజల నమ్మకాన్ని బలపరచే విధంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని ఎస్పీ తెలిపారు.
