సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రాజెక్టు వద్దకు రావొద్దు..
తాంసి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. తాంసి మండలంలోని భీమన్న వాగు కల్వర్టుతో పాటు మత్తడి వాగు ప్రాజెక్టును గురువారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన పరిశీలించారు.
ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అనవసరంగా ప్రాజెక్టు వద్దకు రావద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యటనలో తాంసి, తలమడుగు తహసీల్దార్లు గణేష్, రాజ్‌మోహన్, నీటిపారుదల శాఖ ఈఈ నరేష్, డీఈఈ శ్రీనివాస్‌రావు, ఏఈఈ హరీష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
