దేశ సమైక్యతను చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు వివరించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ: దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం, ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.

పరాయి దేశంతో పోరాడి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించుకున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని మారుతి నగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిపై అవగాహన, చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య, వయోజన విద్య ఉప సంచాలకులు పురుషోత్తం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహనీయుల పోరాటాలు, త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత యువతతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

అంగవైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని, మనిషి మేధస్సుకు కాదని దివ్యాంగ విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని సూచించారు.

దివ్యాంగ విద్యార్థులకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్. సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలను వీక్షించిన పోలీస్ కమిషనర్ వారిని అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం తదితర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల సేవలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, 42వ డివిజన్ కార్పొరేటర్ బెల్లల్ శశాంక్ రెడ్డి, 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రమేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు, దారం గంగాధర్, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.