సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
‘అన్ని పంపులు ఆన్ చేసి నీళ్లు నిల్వ చేయాలి’
ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి: శ్రీనివాస్‌గౌడ్
కృష్ణా జలాలపై కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ హెచ్చరిక
సాగునీటిపై రైతులతో ఉద్యమిస్తాం: బీఆర్ఎస్
జూరాలకు భారీ వరద వస్తున్నా రిజర్వాయర్లను నింపడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విమర్శ
కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోతే పాలమూరు ఎడారిగా మారే ప్రమాదమని హెచ్చరిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, కృష్ణా-గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి. శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పాలమూరు జిల్లాకు కృష్ణా, తుంగభద్ర, భీమా నదులే ప్రధాన ఆధారమని, ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నప్పటికీ రిజర్వాయర్లను నింపే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, అందుబాటులో ఉన్న అన్ని లిఫ్ట్ పంపులను వెంటనే ప్రారంభించి నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం తాగునీటి అవసరాలకే నీటిని పరిమితం చేయడం సరైన విధానం కాదని, సాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేస్తే దానిని వినియోగించుకునే అవకాశం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించకుండా ప్రభుత్వం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును భవిష్యత్ కరువులను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని, ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తున్న లిఫ్ట్ వ్యవస్థలు కూడా ఆ ప్రాజెక్టులో భాగమేనని పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా నదులపై ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తిస్థాయిలో నడపాలని కోరిన శ్రీనివాస్‌గౌడ్, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు కృష్ణా జలాల లభ్యత తగ్గి పాలమూరు, నల్గొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం స్వాగతించదగ్గ పరిణామమేనని, అయితే ఆ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేసి కాలువల పనులకు వెంటనే టెండర్లు పిలవాలని కోరారు.
అదే సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, పాలమూరు రైతులకు సాగునీరు అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అన్ని పంపులను వెంటనే ప్రారంభించి రామన్నపాడు సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
