అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే పింఛన్లు…

వాల్మీకి విగ్రహానికి పైన స్లాబ్ వేసేందుకు రూ.1,00,000 అందజేత
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.10,000 ఆర్ధిక సాయం అందజేత
నాలుగవ రోజు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం..
వడ్డేపాల్యం గ్రామంలో స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే


కళ్యాణదుర్గం టౌన్, జులై 30 (ఆంధ్రప్రభ) : వైసీపీ ప్రభుత్వంలో రకరకాల కారణాలు చెప్పి ఎంతో మంది నిరుపేద వృద్దులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని కూటమి ప్రభుత్వంలో త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించి వారికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులతో కలసి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కి గ్రామస్థులు, నాయకులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలుకగా ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య పాలన, కనీసం గ్రామాల్లో సరైన మౌళిక వసతుల కల్పనపై కూడా ద్రుష్టి పెట్టకుండా సమస్యలను పెంచి వెళ్లారని ఇప్పుడు వాటిని అదిగమించి గ్రామీణ రహదారులతో పాటు గ్రామాల్లో మౌళిక వసతులైన విద్యుత్, తాగునీరు, సీసీ రహదారులు నిర్మించి ప్రజల సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు.గ్రామంలో వాల్మీకి విగ్రహానికి పైకప్పు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరగా వెంటనే తన స్వంత నిధులతో పూర్తి చేస్తామని అందుకు పనులు ప్రారంభించేందుకు గాను 1,00,000 రూపాయలు గ్రామస్థులు అందించారు..

గ్రామంలో నాగమ్మ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వెంటనే వైద్యులతో మాట్లాడి మరింత మెరుగైన వైద్యం అందేలా చూస్తామని ఖర్చుల కోసం 10,000 రూపాయలు అందించారు..గ్రామానికి చెందిన మారెక్క, యశోదమ్మలకు వైసీపీ ప్రభుత్వంలో పింఛన్ తొలగించారని తెలుసుకుని త్వరలో తప్పకుండా పింఛన్ మంజూరు చేస్తామని వారికీ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున అందజేశారు..ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాంపౌండ్ నందు సీసీ, టాయిలెట్లు అవసరం ఉందని అడగ్గా తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.