గత మూడు రోజుల వర్షాలకు కొట్టుకుపోయిన పంటలు
నీట మునిగిన వరి, పత్తి పంటలు..
పరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి
దండెపల్లి, ఆంధ్రప్రభ : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దండెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరి, పత్తి తదితర పంటలు నీట మునిగాయి. పలుచోట్ల మట్టి కోతకు గురై వరి నాట్లు కొట్టుకుపోయాయి.
భారీ వర్షాలతో పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం ఇప్పటికే చేసిన పెట్టుబడులు వృథా అయ్యాయని, పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులు వెంటనే పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
