సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి…
కూటమి పథకాలను మెచ్చుకుంటున్న ప్రజలు..
టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దా వెంకన్న
( భవానిపురం ఆంధ్రప్రభ ) : కూటమి ప్రభుత్వ అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్‌టౌన్ చిట్టినగర్‌లోని 46వ డివిజన్ కలర్ హాస్పిటల్ ప్రాంతంలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. 47వ డివిజన్ అధ్యక్షుడు పోతినేడి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రతి ప్రాంతంలో విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాయకులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పెంపు కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలవారీ పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచి ఇచ్చిందని గుర్తుచేశారు.

ఈ నిర్ణయంతో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజా మద్దతు బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలేనని, పార్టీ పదవుల్లో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్తగా పనిచేయాలన్నదే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశయమని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజా బలంతో కూటమి ప్రభుత్వం మరింత కాలం ప్రజాసేవ కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ సాగర కార్పొరేషన్ చైర్మన్ ఎస్. ఏడుకొండలు, పార్టీ నాయకులు గుర్రంకొండ, నాగోతి రామారావు, ధనాల శీను, పీతల హరి, శీను నాయక్, నంద కుమారి, దనేకుల సుబ్బారావు, కామా దేవరాజ్, నమ్మి భాను, బెవర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
