నగరాల సమాజ భవిష్యత్తుకు బలమైన దిశా నిర్దేశం అవసరం
నగరాల సమాజ భవిష్యత్తుకు బలమైన దిశా నిర్దేశం అవసరం
- బాయిన బాబుజి
భవానిపురం, ఆంధ్రప్రభ: రాబోయే తరానికి బంగారు బాట వేసే దిశగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబుజి కోరారు. నగరాల సామాజిక వర్గం స్వర్ణోత్సవ శుభాకాంక్షల నేపథ్యంలో, భవిష్యత్ తరాలకు బలమైన దిశా నిర్దేశం చేయాలనే సంకల్పంతో ఆదివారం విజయవాడ నడిబొడ్డున ఒక ప్రముఖ హోటల్లో ఆయన అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ముందుగా నగరాల పెద్దలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాయిన బాబుజి మాట్లాడుతూ, రాజకీయ, ధార్మిక, ఆర్థిక రంగాల మేధావులు, కుల పెద్దలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలందరూ ఒక తాటిపై వచ్చి అభిప్రాయాలు, సూచనలు పంచుకోవడం నగరాల సామాజిక వర్గ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐక్యతే బలం, అభిప్రాయమే దిశా నిర్దేశం అని అన్నారు.
నాలుగు దశాబ్దాలుగా సామాజిక వర్గానికి రాజకీయంగా, ప్రభుత్వ పరంగా రావాల్సిన గుర్తింపు ఆశించిన స్థాయిలో అందలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉదాసీనత చూపితే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లవుతుందని హెచ్చరించారు. సామాజిక వర్గ భవిష్యత్తు కోసం బలమైన కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధనలో ఐదు సంవత్సరాల వెసులుబాటు రావడం గర్వకారణమని, కృషి చేసిన ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయ ఆస్తులు, ధార్మిక సంస్థలను కాపాడుకుని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. శ్రీ నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకవర్గం ఏర్పాటు అంశంపై కూడా అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పెద్దలు, యువజన సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
