అనుమతులు లేవని కూల్చివేతలు
కట్టడాలపై రెండు వర్గాల మధ్య వివాదం
కూల్చివేతలను పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే
గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమకు చెందిన భూముల్లో అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం సింగరేణి స్పెషల్ స్క్వాడ్ బృందం కూల్చివేసింది.
సింగరేణి భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించి కొందరు ప్రైవేటు వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. సింగరేణి కంపెనీకి చెందిన స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, అందుకే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కూడా సింగరేణి భూములను ఆక్రమించి ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. సింగరేణి భూములను ఆక్రమణల నుంచి రక్షించేందుకు ఇలాంటి ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
తిలక్‌నగర్ చౌరస్తా ప్రాంతంలో ఇటీవల రేకుల షెడ్లలో ఉన్న దుకాణాలను తొలగించారు. వాటి స్థానంలో పక్కా నిర్మాణాలు చేపట్టే అంశంపై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. గతంలో ఉన్న దుకాణాల కంటే రెండింతలు షాపులు నిర్మించి, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో కొందరు అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూల్చివేతలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా, తిలక్‌నగర్‌లో సింగరేణి అధికారులు కూల్చివేసిన దుకాణ సముదాయాల ప్రాంతాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. కూల్చివేతలకు గల కారణాలపై సింగరేణి అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.
